రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ఆర్‌సీహెచ్‌ఐ)వద్ద టాలీవుడ్ సూపర్‌స్టార్ శ్రీ మహేష్‌బాబు ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన మద్దతును మరీ ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన మెరుగైన వైద్య సేవలకు మద్దతునందించడంలో శ్రీ మహేష్‌బాబు ఎప్పుడూ ముందే ఉంటుంటారు. ఈ పీఎల్‌హెచ్‌ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ మహేష్‌బాబు ఫౌండేషన్ ద్వారా ఆర్‌సీహెచ్‌ఐ వద్ద చిన్నారులకు మద్దతునందించేందుకు కట్టుబడినట్లు వెల్లడించారు.
భారతదేశంలో ప్రతి 1000 మంది నవజాత శిశవులలో 10 మందికి పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దాదాపు 2లక్షల మందికి పైగా నవజాత శిశువులు భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులతో జన్మిస్తున్నారు. ఈ నవజాత శిశువుల్లోనూ ఐదవవంతు మందికి అతి తీవ్రమైన రీతిలో పుట్టుక లోపాలు కనిపిస్తున్నాయి. వీరికి తొలి సంవత్సరంలోనే తగిన చికిత్సనందించాల్సిన అవసరమూ ఉంది.
ఈ తరహా శిశువులు కలిగిన అధికశాతం కుటుంబాలు నాణ్యమైన చిన్నారుల గుండె సంరక్షణ కోసం తగినంతగా ఖర్చు చేయలేని స్థోమత కలిగి ఉంటున్నాయి. ఈ కారణం చేతనే ఎక్కువ సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతుండటం తో పాటుగా మృతి చెందుతున్నారు. ‘‘చిన్నారులలో గుండె సంబంధిత శస్త్రచికిత్సలు సాధారణంగా ఒకసారి చేసే ప్రక్రియగా ఉంటుంది. ఉత్పాదక జీవితం వైపుగా చిన్నారులు పయణించేందుకు ఇది సహాయపడటంతో పాటుగా దేశం సమృద్ధి కావడానికీ తోడ్పడుతుంది. కానీ, దురదృష్టవశాత్తు యుక్తవయసు తల్లిదండ్రులు ఈ చికిత్స కోసం అవసరమైన నిధులను సమకూర్చడంలో విఫలమవుతుంటారు. డాక్టర్లుగా, కాస్త ఆర్థిక సహాయం ఉంటే ఈ చిన్నారులకు అతి సులభంగా తగిన చికిత్సను అందించగలమని భావిస్తున్నాము. ఈ సమస్యకు తగిన పరిష్కారం కనుగొనే క్రమంలో ఆవిష్కరించబడినదే ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’’ అని డాక్టర్ చిన్నస్వామి రెడ్డి, ఛైర్మన్ – ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ అన్నారు.
ఈ సందర్భంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మరియు చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి మాట్లాడుతూ ‘‘సమాజంలో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న పుట్టుకతో వచ్చే లోపాలలో పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు ఒకటి. ఆర్‌సీహెచ్‌ఐ వద్ద మేము దాదాపు 900కు పైగా కార్డియాక్ సర్జరీలను చేయడంతో పాటుగా గత రెండు సంవత్సరాలలోనే 850కు పైగా కార్డియాక్ ప్రక్రియలను చేశాం. వీరిలో అధికశాతం ఒక సంవత్సరం లోపు వయసు ఉండి అతి తీవ్ర అనారోగ్యం బారిన పడిన పిల్లలు. మా ఇనిస్టిట్యూట్ వద్ద అన్ని రకాల పుట్టుకతో వచ్చే గుండె లోపాలకూ చికిత్సలనందిస్తున్నాము. ఇక్కడ ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఓ క్లీనిషియన్‌గా తానెప్పుడూ కూడా ఈ చిన్నారులకు తగిన సహాయమందించే ఓ ఫౌండేషన్ ఉంటే మరింత మంది చిన్నారులు, శిశువులకు తగిన మద్దతునందించగలమని భావిస్తుంటాను’’ అని అన్నారు.
‘‘గుండె లోపాలతో బాధపడుతున్న చిన్నారుల చికిత్సలో సమయం అత్యంత కీలకమైనది. సమయానికి వ్యాధిని గుర్తించడం, ప్రక్రియ ప్రణాళిక, తగిన చికిత్సనందించడం మరియు చిన్నారుల ఆరోగ్య స్ధితిని తెలుసుకుని తదనుగుణంగా ప్రక్రియలో మార్పులు చేయడం ద్వారా ఆ చిన్నారులు వ్యాధి బారినుంచి బయటపడటంతో పాటుగా తమ జీవితంలో మరోమారు ఆ సమస్య ఎదుర్కొనరు. ఈ తరహా లోపాల చికిత్సకు నైపుణ్యవంతులైన క్లీనిషియన్లు, పారామెడిక్స్, నర్సింగ్, అత్యున్నత స్ధాయి యంత్రసామాగ్రి మరియు ఔషదాల మద్దతు అవసరం. నాణ్యమైన చికిత్సకు తగిన నిధుల అవసరం కూడా ఉంది. ఈ ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యం , నాణ్యమైన చికిత్సను అవసరమైన ప్రతి చిన్నారికీ అందించడం, ఆఖరకు జీవితాన్ని మార్చే వైద్య జోక్యం కోసం ఖర్చులేని వారికి సైతం ఇది మద్దతునందిస్తుంది’’ అని డాక్టర్ చిన్నస్వామి రెడ్డి అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘రెయిన్ బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వద్ద మేమెప్పుడూ కూడా ప్రతి చిన్నారి జీవితం ఎంతో విలువైనదిగా భావిస్తుంటాం. ఈ కారణం చేతనే మా ఫౌండేషన్ ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు హృదయ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం అందించడానికి ఆర్థిక సహాయం అందించడం, నిర్వహించడం మరియు మంజూరు చేయడంపై దృష్టి సారించింది. మేము స్ధిరంగా మా చికిత్సా పద్ధతులను మెరుగుపరుచుకోవడం, సృజనాత్మకంగా తీర్చిదిద్దడం ద్వారా చిన్నారులకు కార్డియక్ చికిత్సలను మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నాం’’అని అన్నారు.
ఈ సందర్భంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ ‘‘చిన్నారులకు కార్డియాక్ చికిత్సలనందించడం నాకెంతో ఇష్టమైన అంశం. ఎందుకంటే, ఒక్కసారి చికిత్స ప్రక్రియలను అనుసరిస్తే సరిపోతుంది. ఈ చిన్నారులకు, ఒకసారి చికిత్సనందిస్తే, సామాన్య వ్యక్తుల్లానే మారిపోతారు మరియు దేశాభివృద్ధికి తమవంతు తోడ్పాటునీ అందిస్తారు. ఆర్‌సీహెచ్‌ఐను 2019లో భారతదేశంలో అతిపెద్ద పీడియాట్రిక్ కార్డియాక్ హాస్పిటల్స్‌లో ఒకటిగా 100 పడకలతో ప్రారంభించాము. తద్వారా ఎంతోమంది చిన్నారులు సాధారణ జీవితం గడిపేందుకు తగిన అవకాశమూ అందించాము. ఎంతోమంది చిన్నారుల జీవితాలలో మార్పులను తీసుకురావడంలో మా అత్యద్భుతమైన డాక్టర్లు, నర్సులు మరియు పారామెడిక్స్ సాధించిన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఈ ఫౌండేషన్ ద్వారా 50 మందికి పైగా ఈ తరహా చిన్నారులకు మద్దతునందించడానికి కట్టుబడి ఉన్నాను’’అని అన్నారు.
‘‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా విచ్చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుతున్నాము. రెయిన్‌బోతో ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది మరియు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్సనందించడంలో మా సామర్థ్యం పట్ల ఆయనకు అవగాహన ఉంది’’అని డాక్టర్ రమేష్ అన్నారు.
రెయిన్‌బో హాస్పిటల్స్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఉంది. ‘‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి రావడం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వారెప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారు. మహేష్‌బాబు ఫౌండేషన్ ద్వారా ఆర్‌సీహెచ్‌ఐ వద్ద కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు అవసరమైన సహాయమందించనున్నాం. చిన్న గుండెలు అసాధారణ సంరక్షణకు అర్హమైనవి’’అని మహేష్‌బాబు అన్నారు.
ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్– రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ గురించి...
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు సమగ్రమైన కార్డియాక్ కేర్ అందించేందుకు కట్టుబడినది ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్. ఈ దేశవ్యాప్తంగా సమాజానికి తిరిగివ్వాలని కోరుకునే వ్యక్తులు, కార్పోరేట్స్ నుంచి సేకరించిన విరాళాల ద్వారా కార్డియాక్ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు అవసరమైన నిధులను అందించాలని ఈ ఫౌండేషన్ కోరుకుంటుంది. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు, కార్డియోథొరాకిక్ సర్జన్లు,అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక ఉపకరణాలు, సదుపాయాలు మరియు అత్యుత్తమ నర్సింగ్ కేర్ ద్వారా గుండె సంబంధి త సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు తగిన ఆశ, పరిష్కారాలను ఈ కార్యక్రమం అందించనుంది.
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను చేసేందుకు రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఫౌండేషన్‌తో మహేష్‌బాబు ఫౌండేషన్ భాగస్వామ్యం చేసుకుంది. ఈ సహాయం అవసరమైన కేసులను డాక్టర్ల బృందం ఎంపిక చేస్తుంది. ఈ ఆర్ధిక సహాయం అవసరమైన కేసులను కేస్–టు–కేస్ పద్ధతిలో డాక్టర్ల బృందం నిర్ణయిస్తుంది. ఏ ఒక్క చిన్నారీ నిధుల కొరతతో ఇబ్బంది పడకూడదన్నది ఈ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం. అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం వీలైనంత ఉత్తమ చికిత్సను అందిస్తామనే భరోసాను ఈ ఫౌండేషన్ అందిస్తుంది. అందువల్ల ప్రాణాలను కాపాడటమూ సాధ్యమవుతుంది.
అత్యంత క్లిష్టమైన కేసుల చికిత్సను చేయడానికి అంగీకరించిన డాక్టర్ చిన్నస్వామి రెడ్డికి ఫౌండేషన్స్ తరపున మహేష్‌బాబు ఫౌండేషన్ ధన్యవాదములు తెలిపింది.
No comments:
Post a Comment